Manasija

Manasija

తెలుగు నా మాతృభాష.నాకెంతో ఇష్టమైన భాష.చక్రవర్తులచేదేశ భాష లందు తెలుగు లెస్సఅని కీర్తింపబడిన భాష.త్రిలింగ దేశపు తీయటి తేనెలొలుకు భాష.పూర్ణ భాష.సంగీతమునకే వన్నె తెచ్చిన భాష.అటువంటి నా భాష నేడు తన ఉనికిని కోల్పొతోంది.

కవిత్రయం మొదలు పోతన,శ్రీనాథుల వంటి కవి సార్వభౌములను,అన్నమయ్య,రామదాసు,త్యాగరాజు వంటి వాగ్గేయకారులను,శ్రీ కృష్ణదేవరాయల వంటి చక్రవర్తులనూ తరింపజేసినట్టి నా భాష ను సంరక్షించుకునేందుకు అర్హమైన శక్తి కాని బుద్ధి కాని నాకు లేకపోయినప్పటికీ……

ఆమె తల్లి..,

నేను బిడ్డను.

ఇంతకన్నా అనుబంధం కావాలి?? అధికారం తోనే(గర్వం గా చెప్పుకుంటున్నాను) ప్రయత్నం చేస్తున్నాను.

ఒక ప్రాంతపు సంస్కృతి,ఆచారం భాష ద్వారానే భావి తరాలకు గ్రంథరూపాల్లో అందించబడతాయి.అటువంటి భాష నేడు కనుమరుగవుతోంది.దానిని కాపాడుకోవాలంటే భాషలొనే మాట్లాడాలి,చదవాలి,వ్రాయాలి.కాలంలో కరిగిపోనీయకుండా ప్రాణం పోయాలి.

సంకల్ప వికల్ప సమాహారమైన మనసులో ఎన్నో అందమైన,మరెన్నో మధురమయిన,గాఢమైన భావాలు.అలా పొందిన,కలిగిన అనుభూతులని

మాతృసేవ లో తరించిన మహానుభావులందరినీ స్మరించి నమస్కరిస్తూమనసిజ పుష్పములు గా వినయంగా భక్తి తో తెలుగు తల్లి పాదారవిందములకు సమర్పిస్తున్నాను.”

-తప్పులుంటే పెద్దమనసుతో మన్నించి , తెలిపి ఆశీర్వదించగలరు.

Wednesday, March 14, 2012

Priyaa....




"మనసంతా నిండి మరువని ఙాపకానివై దాగి కనిపించవా
గుండె సెగలతో కంటి తడిలో ఎండమావివైనావా

నీ పిలుపుకై వేచి ఉన్న వీనులకి వినిపించవా
మరుమాటే లేని మౌనం లో నేడు మూగవైనావా

తొలిపొద్దులో తెలిమంచులో తుషారమై రావా
నీవు లేని నిశిరాతిరి లో నా హృదయాగ్ని జ్వాలలనార్పవా


మానసదేవతకి హృదయనైవేద్యం నా నేరమంటావా
దర్శనమీయక కనులకి దూరమై ఇలా శిక్ష వేశావా

నీ ఎడబాటే తీర్చగా నవ వసంత  సమీరమై రావా
మోహనరాగమై నా మది వీణా తంత్రుల మీటవా

నీ వదనమనే తామర పూసిన మానస సరోవరమునకు భ్రమరమ్మై రావా 
సుమధుర మధు మందార మిళితమైన నా ప్రేమామృత సుధాధారల గ్రోలవా


రవికిరణం పై పడి మెరిసిన హిమబిందువు నీ ముక్కుపుడకై తోచె
విమల కోమల ధవళ వర్ణపు సంపంగి నీ నాసిక గా కనిపించె
గల గల పారే సెలయేటి ప్రవాహ చప్పుడు నీ పలుకులు గా వినిపించె
సుధాకర తేజ స్పర్శితలై విరిసిన కలువలు నీ కన్నుల అసూయ నొందె 

పురివిప్పి మయూరం నాట్యమాడగా జేయు నల్లని మబ్బులు నీ కురులు గా తోచె
మలయమారుత పవనం ఏకాంతవేళ నను తాకగా నీ తొలిస్పర్శ మది మెరసి వేధించె

తిమిరాంతకమై ఉదయించే అరుణకిరణమై
చెక్కిలి మీటగ పలకరించే సాయంత్రపు పవనమై  రావా

నీపై వీచిన గాలికి సుగంధమే అంటగా
తన సాటి మరి ఎవ్వరనే మల్లెల పొగరణచగా 

నాలో నిను వెతికే శ్వాస కి బదులు గా

ఉన్నావని తెలిపే హృదయ స్పందన గా రావా 


నీ నిఛ్చ్వాసల వేడి సదా నా గుండెను తాకే వేళ
యుగములై   కాలం  కరగగా
                                       చెలీ..
                                   నను చేరవా……

సఖీ
         నీవు..
ఆకాశంలో దాగిన వెన్నెలవో
నా హృదయం లో చేరిన తారకవో

కోయిల గొంతున నిండిన తేనియ వో
మూగబోయిన మాటకి మాతృక వో

సౌమ్య సుమనోహర అభిసారికవో
మనసు హరించిన ప్రియమేనకవో

సరిగమల శ్రీ రాగపు మాధురి వో
హిందోళ రాగపు నవమోహన వో

నెమలి కి నడకలు  నేర్పిన భామిని వో
తడబడిన అడుగులకి  జవాబు వో

కళ్ళలో వెలుగులు నింపిన తొలికిరణమువో
కలలు చెరిపిన నిశి రాతిరివో

మానసవన నిత్య సంచారిణి వో
శిలగా మిగిలిన నిశ్చల వో

ఆశల సౌధముల యువరాణివో 
                               నా హృదయ కుటీరపు చిరనివాసిని వో

తారల దరి చేర్చిన హృదయ దేవత వో
                            నాకు నన్నే దూరం చేసిన ప్రియ శత్రువు వో                   

నీవు లేక బ్రతుకలేని
నిను చూడక నిలువలేని
నిను వెతకగ అలుపులేని
నిను తలపగ నిదురలేని
                              నను
                                               బంధింపుమా నీ గుండెల్లో
                                                చేర్చుకో నీ కౌగిట్లో
                                                నిలువనీ నయనాలలో 
                                                నడవనీ పయనాలలో

No comments:

Post a Comment